
లోకేష్ శంఖారావంతో ప్రజలకు భరోసా
పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరుచరిత రెడ్డి
కల్లూరు టౌన్, ఫిబ్రవరి 14, (SK1 NEWS HD):
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకుల అరాచకాలకు వ్యతిరేకంగా ఈనెల 11 నుంచి తెలుగుదేశం పార్టీ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పూరించిన నాదమే శంఖారావం అని పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆమె పత్రికా ప్రకటన విడుదల చేశారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ పర్యటించని నియోజకవర్గాల్లో శంఖారావం కార్యక్రమం తో పర్యటించి జగన్ ప్రభుత్వ దౌర్జన్యాలపై ప్రజలకు కార్యకర్తలకు తెలియజేయనున్నారన్నారు. నిరుద్యోగంతో యువత ఇబ్బందులు పడుతుండగా ధరల పెరుగుదలతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించేందుకు టిడిపి ప్రతిష్టాత్మకంగా శంఖారావం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నారా లోకేష్ బాబు శంఖారావం చేపట్టనున్నారని ఇందులో భాగంగా రానున్న 40- 50 రోజులలో 120 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ పర్యటన జరగనుందన్నారు. ఈ కార్యక్రమంతో తెలుగుదేశం పార్టీ చేపట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి చేరువ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే యువగలం పాదయాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలో, పట్టణాలలో సుమారు 220 రోజులపాటు 3132 కిలోమీటర్ల మేర లోకేష్ బాబు దిగ్విజయంగా పాదయాత్ర చేసి ప్రజలకు చేరువయ్యారన్నారు. యువ గళం యాత్రను ఉత్తరాంధ్రలో కొనసాగించాలనుకున్న టిడిపి అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుతో అడ్డంకులు ఎదురయ్యాయన్నారు. ఇప్పుడు చేపట్టనున్న ఈ శంఖారావంతో ప్రభుత్వంలో బాధితులుగా మారిన అన్ని వర్గాల ప్రజలకు ఓ వైపు భరోసా కల్పించడమే గాక మరోవైపు కార్యకర్తలకు చేరువకావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయం కావడానికి అన్ని వర్గాల వారు మద్దతు తెలియజేయాలని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి కోరారు .



