
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
కలెక్టరేట్,ఆర్డీవో కార్యాలయాలు, తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూం లు ఏర్పాటు చేయండి
టెలికాన్ఫరెన్స్లో సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా. జి. సృజన
కర్నూలు ప్రతినిధి, జూలై 26, (SK1 NEWS HD) :
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాను రెడ్ అలెర్ట్ గా ప్రకటించడం జరిగిందని,ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం వర్షాల నేపథ్యంలో ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో శిథిలమైన భవనాలు ఉన్న చోట ప్రజలను బయటకు తీసుకొని రావాలని కలెక్టర్ పేర్కొన్నారు. వీలైనంత వరకు ప్రజలు బయటికి రాకుండా ఇళ్లల్లోనే ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా నదీ పరీవాహక ప్రాంతాలు, చెరువులు ఉన్న ప్రాంతాల అధికారులు నిరంతర పర్యవేక్షణ చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, వర్షపాత నమోదు శాతం ఎక్కువైనా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తన దృష్టికి తీసుకొని రావాలని కర్నూలు, పత్తికొండ ఆర్డీవో లను, ఆదోని సబ్ కలెక్టర్ ను, మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు.. కలెక్టరేట్,ఆర్డీవో కార్యాలయాలు, తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూం లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు..రెవెన్యూ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని టెలికాన్ఫరెన్స్లో సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోలో 100 శాతం పురోగతి సాధించాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు.. కళాశాలలు, పాఠశాలల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మండల విద్యాశాఖ అధికారులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు చైల్డ్ ఇన్ఫో లో అప్డేట్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని డిఈఓ, ఆర్ఐఓ, మండల స్పెషల్ ఆఫీసర్లను, ఎంపీడీవోలను, మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. ఈరోజు సాయంత్రం లోపు 100 శాతం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్లో నగరపాలక కమిషనర్ భార్గవ్ తేజ, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, కర్నూల్, పత్తికొండ ఆర్డీవోలు, సర్వ శిక్ష అభియాన్ పిఓ వేణుగోపాల్, తహసిల్దార్లు, ఎంపీడీవోలు,మండల విద్యా శాఖ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.



