వీఆర్ఏలకు ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రి నెరవేర్చాలి

వీఆర్ఏలకు ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రి నెరవేర్చాలి
ఓర్వకల్లు, జులై 21, (SK1 NEWS HD) : ఎన్నికల ముందు పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సిఐటియు జిల్లా నాయకులు శ్రీధర్, ఆర్విఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్, డిమాండ్ చేశారు. వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం ఓర్వకల్లు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆ సంఘం అధ్యక్షుడు ధనుంజయ అధ్యక్షతన చేపట్టిన దీక్ష శుక్రవారం రెండవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా నాయకులు అంజి, శ్రీధర్, రవీంద్రనాథ్ లు దీక్షకు మద్దతు తెలిపి మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటైన వారం రోజుల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మాట తప్పి విఆర్ఏ లను మోసం చేశారని విమర్శించారు. వీఆర్ఏలకు పే స్కేల్ చేస్తానని, వన్ టైం సెటిల్మెంట్ కింద 60 ఏళ్ళు దాటిన ప్రతి వీఆర్ఏ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వీఆర్ఏకు విఆర్ఓగా పదోన్నతి కల్పిస్తానని హామీలు ఇచ్చి నాలుగున్నర ఏళ్ళు గడిచినా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. వీఆర్ఏలు గ్రామాల్లో అధికారులకు, ప్రజలకు ఎన్ని సేవలు చేసినా ముఖ్యమంత్రి గుర్తించకపోవడం బాధాకరమన్నారు. రెవెన్యూ శాఖలో చిరు ఉద్యోగులుగా పనిచేస్తున్న వీఆర్ఏల మీద ప్రభుత్వం కక్ష కట్టడం సబబు కాదన్నారు. వీఆర్ఏల సమస్యలు వెంటనే పరిష్కరించని పక్షంలో సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆగస్టు 7, 8 తేదీల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, 25 వేల మంది వీఆర్ఏలతో ఆగస్టు 25న చలో విజయవాడ కార్యక్రమాలకు బయలుదేరుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల నాయకులు విక్రమ్, వెంకటరమణ, జిల్లా నాయకులు ప్రహ్లాద, ధనుంజయ, రాజు, నాగరాజు, రంగన్న, హనుమంతు, శివ ప్రసాద్, కొండన్న, అయ్య స్వామి, మండల వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.



